ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయ్యింది. తొలి,మలి విడత ఉద్యమాలతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో పోరాడిన అనేక మంది యువత ప్రాణ త్యాగాలకూ వెనుకడుగు వేయలేదు. సబ్బండ వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి స్వయం పాలన తెచ్చుకున్నాయి. జూన్ 2న స్వయం పాలన ప్రారంభమై పదేళ్లు అవుతుంది. మరి అనుకున్న విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందా.. ? ప్రజల ఆకాంక్షలు నెరవేరేదిశగా తెలంగాణ సాగుతోందా..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాజకీయ పరిణామాలు ఇతర విషయాలు పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఎంతో మార్పు వచ్చింది. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు వేశారు. ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఊహించనంతగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రికార్డుల స్థాయిలో పెరుగుతోంది. ప్రజలకు అవసరమైన నీరు, విద్య వంటి కనీస అవసరాల విషయంలో ప్రజలు ఊహించని రీతిలో అభివృద్ది సాధించింది. తెలంగాణకు పెద్ద ఎత్తున వలస వస్తున్నప్రజల కారణంగా పెరుగుతున్న జనాభా వల్ల వారి అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సవాల్ గా మారుతున్నప్పటికీ.. వాటిని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక గత పదేళ్లలో హైదరాబాద్ ఎవరూ ఊహించలేని విధంగా ఎదిగింది. పదేళ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ లోపలే హౌసింగ్ ప్రాజెక్టులు ఉండేవి. కానీ ఇప్పుడు ఔటర్ దాడి ఇరవై కిలోమీటర్ల వరకూ నగరం విస్తరిస్తోంది. అందుకే రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అది కూడా రూపాంతరం చెందితే.. నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్ నగరం చెన్నై, బెంగళూరు వంటి నగరాలను మించి అతి పెద్ద నగరంగా ఆవిర్భవిస్తుంది. రాజకీయ పార్టీలు .. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా.. సొంత రాష్ట్ర రాజధానిపై మాత్రం ఎప్పుడూ చిన్న చూపు చూపడం లేదు. హైదరాబాద్ కు ఏది అవసరమో అ ప్రాజెక్టులు చేపట్టేందుకు కొత్త ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది. మూసీని సుందరీకరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. అలాగే నలు వైపులా మెట్రోల నిర్మాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో నగరంలో ఏ మూలు చూసినా ఫ్లైఓవర్లు.. అండర్ వేలు నిర్మంచారు. ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి ప్రయత్నించారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం ఓ సవాల్ గా మానే మారింది. అయితే అన్ని సమస్యలు ఒకే సారి పరిష్కారం కాలేవు.. ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలాంటి కోణంలో ఆలోచించినప్పుడు.. ఇతర నగరాలతో పోల్చి చూసినప్పుడు గత పదేళ్లలో తెలంగాణ అనూహ్యమైన అభివృద్దిని సాధించిందని అనుకోవాలి.
ప్రత్యేక రాష్ట్రంలో హైదరాబాద్ భాండాగారంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఎక్కువగా ఆందోళన చెందిన అంశం విద్యుత్. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం తక్కువ. అందుకే ఏపీ నుంచి ఎక్కువ కరెంట్ తెలంగాణకు వచ్చేలా విబజన చట్టంలో పెట్టారు. అయితే చాలా వేగంగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్వయం సమృద్ధి సాధించింది. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంది. విద్యుత్ ఉత్పాదక పెంచిందా.. కొనుగోలు చేసిందా అన్న విషయాలను పక్కనపెడితే ప్రజలకు సమస్యలు రాకుండా చూసుకుంది. అలాగే ప్రజలకు తాగు, సాగునీరు విషయంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలను అధిగమించగలిగారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా కుళాయి సౌకర్యం కల్పించారు. వాతావరణం అనుకూలించడం.. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విషయంలోనూ తెలంగాణ పురోగతి సాధించిందని అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మరో కీలక అంశం నీరు. అందుకే తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ రీ ఇంజినీరింగ్ చేశారు. ప్రాజెక్టులు రీ డిజైనింగ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల స్వరూపాన్ని మార్చి మరింత విశాలమైన ప్రయోజనాలు అందేలా తీర్చిదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు. కానీ పాలమూరు – రరంగారెడ్డి విషయంలో పెద్దగా ముందడుగు వేయలేకపోయారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకు వెళ్లే ముందు కుంగిపోవడం సమస్యగా మారింది. ఆ ప్రాజెక్టు పునర్వియోగానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉందన్న అంచనాలు వేస్తున్నాయి. పదేళ్లు తెలంగాణ పయనాన్ని చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే.. మెరుగైన అభివృద్ది సాధించామన్న అభిప్రాయానికి రావొచ్చు. ఈ విషయంలో తెలంగాణ సాధన ప్రయోజనాలను సాధించే దిశగా పయనం సాగుతోందని సంతృప్తి చెందవచ్చని ఉద్యమకారులు అంచనా వేస్తున్నారు.