కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం అటూ ఎన్డీఏ ఇటూ ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆరు విడతల పోలింగ్ ముగిసింది. జూన్ ఒకటిన ఆఖరి విడత పోలింగ్ జరనుంది. ఈనేపథ్యంలో కేంద్రంలో గెలుపు ఎవరిది అనే అంశంపై పలు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో సెంట్రల్ లో ఈ సారి గెలుపు పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈ సారి కేంద్రంలో అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఆ పార్టీ నాలుగు వందల సీట్ల మైలురాయిని చేరుకునే అవకాశమే లేదని, ఇండియా కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేరళ పర్యటనలో రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి పలు విషయాలను ఉదాహరించారు. బీజేపీ ప్రకటించినట్లుగా 400 సీట్ల కల సాకారం కావాలంటే పాకిస్థాన్ లో పోటీ చేయాలన్న రేవంత్ …ఈ పార్టీ ఎందుకు ఆ సీట్లను అందుకోలేదో వివరణ ఇచ్చారు.
బీజేపీకి తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా రాదని.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కేవలం 20 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. సౌత్ లో మొత్తంగా 121 ఎంపీ సీట్లు ఉంటే అందులో ఇండియా కూటమి ఈజీగా 100 సీట్లు గెలుస్తుందని, అలాగే ఉత్తరాదిన గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ లో గతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందని, ఈ సారి కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో గణనీయమైన స్థానాలను చేజిక్కించుకుంటుందన్నారు. అలాంటప్పుడు బీజేపీ 400 సీట్లను ఎలా కైవసం చేసుకుంటుందన్నది రేవంత్ వాదన. నిజానికి రేవంత్ వాదన ఏమాత్రం కొట్టిపారేసేలా లేదు. రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఎంతో, కొంత వ్యతిరేకత ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. పైగా, దక్షిణాదిలో వంద సీట్లను కాంగ్రెస్ సాధిస్తుందన్న రేవంత్ నమ్మకం అతిగా ఏం అనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం బీజేపీ సౌత్ లో బలీయంగా లేకపోవడమే. ఏపీలో టీడీపీతో పొత్తు వలన బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తప్పితే మిగతా రాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇక, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ , ఢిల్లీలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను రాబడుతుందని… అదే సమయంలో యూపీలోనూ డబుల్ డిజిట్ కొట్టే అవకాశం ఉండటంతో రేవంత్ చెబుతున్నట్లుగా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మరీ సీఎం రేవంత్ రెడ్డి వాదన ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.