ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు వేళైంది. మరో ఆరో రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కానీ ప్రజల ఫోకస్ మాత్రం కొన్ని సెగ్మేంట్ల పైనే ఉంది. ఇందుకు కారణం… ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర, రాజకీయ సమీకరణాలు. ఈ లిస్ట్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే నెల్లూరు రూరల్ లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేసారు. నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. దాంతో ఇప్పుడు అందరి చూపు ఈ నియోజకవర్గం మీద పడింది. 2014, 2019లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రెండు సార్లు 22 వేలు, 25 వేల మెజార్టీతో గెలిచారు. 2019లో గెలిచిన తర్వాత ఆయన వైసీపీతో విబేధాలతో టీడీపీలో చేరారు. ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని జగన్ సిట్టింగ్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.
ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సారి రాజకీయ వ్యూహం మార్చారు. నియోజకవర్గంలో బలమైన పట్టు ఉన్న మలిరెడ్డి బ్రదర్స్ ను తనవైపుకు తిప్పుకున్నారు. దాంతో వారంతా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం సహకరించారు. కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి అవినీతిని వారంతా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే కోటంరెడ్డి మాత్రం తాను నిత్యం ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యలు పరిష్కరించానని కాబట్టి వారే గెలిపిస్తారని ఆయన నమ్ముతున్నారు. ఇలా ఇద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ సారి గతంతో పోలిస్తే పోలింగ్ ఎక్కువగా నమోదైంది. అయితే ఈ పెరిగిన పోలింగ్ కాస్తా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఈ పెరిగిన పోలింగ్ గ్రామీణ ప్రాంతాల్లో నమోదైందే కాబట్టి అది తమకు కలిసి వస్తుందని చెబుతున్నారు ఆదాల ప్రభాకర్. ఇలా నెల్లూరు రూరల్ లో ఢీ అంటే ఢీ అన్నట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. కాగా కోటంరెడ్డిని ఓడించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. మరి జగన్ పట్టుదల గెలుస్తుందా లేదా కోటంరెడ్డి పంతం నెగ్గుతుందా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.