ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఎన్నడు లేనంతగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగింది. పోలింగ్ కు ఫలితాలకు మధ్య దాదాపు 21 రోజుల సమయం వచ్చింది. దీంతో అభ్యర్థులు ఇప్పటికే తమ గెలుపోటములపై ఒక అంచనాకు వచ్చారు. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన రోజే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళి పైన ఒక స్పష్టత కు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఆ తరువాత జగన్ ఐప్యాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు ఐప్యాక్ తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో మూడు సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కల పైన పూర్తిగా కసరత్తు చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా.. తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పటం లేదు. అయితే రెండు శాతం పెరిగిన మహిళా ఓట్ బ్యాంక్… ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది.
అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత.. పలు వర్గాల్లో ఉన్నఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఇక, తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పని చేసే ఎనిమిది ప్రధాన సర్వే సంస్థలు ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. అయితే..ఈ సారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఓటరు పల్స్ తెలుసుకోవటం కష్టంగా మారిందనే సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే, ప్రతీ ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ ఒన సైడ్ గానే జరిగిందని నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకొనేందుకు హోరా హోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. దీంతో..పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితం పై స్పష్టత వచ్చినా.. అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది.