కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నేత. ఆయన ఏ పార్టీలో ఉన్న… అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు తనదైన మార్క్ ను ప్రదర్శిస్తారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న కడియం ఇటీవలే తన కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం హస్తం పార్టీలో చేరారు. మొదట్లో తెలుగు దేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్, చంద్రబాబు కెబినెట్లలోనూ మంత్రి పదవులను చేపట్టారు. ఎన్నో శాఖల్లో పనిచేసిన అనుభవం కడియంకు ఉంది. అంతేకాదు తన రాజకీయల అనుభవాన్ని పలు శిక్షణ శిబిరాల్లో పాఠాలుగా చెప్పిన పోలిటికల్ టీచర్. టీడీపీ తర్వాత టీఆర్ఎస్ లోచేరి.. కేసీఆర్ సన్నిహిత వర్గంలో ప్రధానమైన వ్యక్తిగా ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవలే జరిగిన అదే పార్టీ తరఫున స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే గా గెలిచి… ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యకు టికెట్ కోసం ఆమెతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చిన కాదని… కాంగ్రెస్ లో చేరి.. వరంగల్ నుంచి బరిలోకి దిగారు. అంతేకాకుండా కూతురు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడియం.. చాలానే కష్టపడ్డారు. రిజల్డ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగానే కడియం శ్రీహరిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో చర్చ మొదలైంది. త్వరలో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరనుంది. ఈ నేపథ్యంలో కడియం పేరు తెరపైకి వచ్చింది. రేవంత్ కెబినెట్ లోకి కడియం వెళ్తారని అంటున్నారు. ఓ వైపు పొలిటికల్ గా సీనియర్ నేత, గతంలో తనతోపాటు కలిసి పనిచేసిన సహచరుడు, ఎస్సీ సామాజికవర్గం నుంచి బలమైన నేత, అంతేకాదు జిల్లాలో తన శత్రువైన ఎర్రబెల్లి తో వైరం ఇలా అన్ని కోణాల్లో పరిశీలించిన రేవంత్ రెడ్డి కడియంకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల సమయంలో… వరంగల్ పర్యటనలో కూడా రేవంత్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలను కాకుండా కడియంను పొగడ్తలతో అందలమెక్కించారు. ఆయన రాజకీయ అనుభవం తమ పాలనకు ఎంతో తొడ్పాటును అందిస్తుందని… అందుకే కడియం మంచి పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి వెదికపైనే చెప్పారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. రిజల్డ్ తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే కడియం పేరు తెరపైకి వచ్చింది. మరో వైపు కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చే ముందే అనేక డిమాండ్ లతో వచ్చారనే టాక్ ఉంది. రేవంత్ రెడ్డినే స్వయంగా తాను పిలిస్తేనే కడియం వచ్చారని చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ కోటరీ లిస్ట్ లో కడియం కూడా చేరిపోయారు.
ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు సీతక్క కాగా, మరొకరు కొండా సురేఖ. ఇద్దరు మహిళలే.. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కడియంకు మంత్రి పదవి ఇస్తే ఎవరికి చెక్ పెడతారనే టాక్ కూడా మొదలైంది. అయితే ఇటీవలే… టీపీసీసీ పదవి ని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో సీతక్క పేరు వినిపించింది. సీతక్కను పీసీసీ చీఫ్ ను చేస్తారని వార్త చక్కర్లు కొడుతోంది. ఇది కన్ఫామ్ అయితే కడియంకు మంత్రి పదవి గ్యారంటీ అని అంటున్నారు. లేకపోతే.. కొండా సురేఖ కు చెక్ పెట్టే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ కు రేవంత్ కు సన్నిహితులు అయిన రేవూరు ప్రకాశ్, సీతక్కల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. దీంతో ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పై ఇన్ డైరెక్ట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఇవేవి కుదరపోయిన కడియం మంత్రి పదవి ఇస్తారనే టాక్ కూడా ఉంది. ముచ్చటగా వరంగల్ లో ముగ్గురు మంత్రులు ఉంటారని అంటున్నారు. ఇన్ని ఈక్వేషన్ ల నడుమ కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందో లేదో చూడాలి.